దేశంలో వందేభారత్ స్లీపర్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో ఈ రైలు టికెట్లకు సంబంధించి రైల్వే మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైలు టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. సాధారణ రైళ్లలో చివరి 4 గంటల వరకు టికెట్ రద్దు చేసినా పాక్షికంగా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయి. వందేభారత్ స్లీపర్ రైలులో మాత్రం అలా కాదు. ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే టికెట్ రద్దు చేసినా ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వరు. ఈ మేరకు రైల్వే పాసింజర్స్ రూల్స్, 2015ను సవరించారు.
వందేభారత్ స్లీపర్ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..
72 గంటల కంటే ముందు రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత విధిస్తారు.
72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ ధరలో 50% కోత ఉంటుంది.
ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే డబ్బులు వాపస్ రావు.
సాధారణ రైళ్లలో
సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ రైళ్లలో టికెట్ ధరలు ఫ్లాట్‌గా ఉంటాయి. తరగతిని బట్టి క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. 4 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసినా కొంత నగదు వెనక్కి వస్తుంది.
ప్రయాణానికి 48 గంటల ముందు వరకు క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా…
ఏసీ ఫస్ట్/ఎగ్జిక్యూటివ్: రూ.240 + జీఎస్టీ
ఏసీ 2 టైర్: రూ. 200 + జీఎస్టీ
ఏసీ 3 టైర్/ చైర్ కార్: రూ.180 + జీఎస్టీ
స్లీపర్: రూ.120
సెకండ్ క్లాస్: రూ.60
48 గంటల నుంచి 12 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25శాతం కోత పడుతుంది.
12 గంటల నుంచి 4 గంటల మధ్య 50% కోత విధిస్తారు.
4 గంటల కంటే తక్కువ ఉంటే డబ్బులు వెనక్కి రావు.
వందేభారత్ స్లీపర్‌లో నో RAC
వందేభారత్ స్లీపర్ రైలులో టికెట్ కన్ఫమ్ అయినవారికే ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్‌ఏసీ (RAC)కి ఇందులో చోటులేదు. అంటే వెయిటింగ్ లిస్ట్, పాక్షికంగా కన్ఫమ్ అయిన ప్రయాణికులను ఈ రైలులో ప్రయాణానికి అనుమతించరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పిరియడ్ నుంచే (60 రోజుల ముందు నుంచి) అన్ని బెర్తులూ అందుబాటులో ఉంటాయి. ఇందులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. ఇతర కోటాలకు చోటు లేదు. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బెర్తులను సిస్టమ్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. 400 కిలోమీటర్ల కంటే తక్కువగా ఎంత దూరానికి ప్రయాణించినా కనీస టికెట్ ధర రూ.960 (థర్డ్ ఏసీకి) చెల్లించాల్సి ఉంటుంది.

