
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల పురుష అభ్యర్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
-ఏర్పాట్లను పరిశీలిస్తున్న కల్నల్ రజత్‌సువర్ణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అధికారులు
ఫిబ్రవరి 17 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ నిర్వహిస్తారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, సక్రమంగా చేయాలన్నారు.
ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణ మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17 నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లరికల్, స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్ తదితర విభాగాలలో 10వ తరగతి, 8వ తరగతి విభాగాలలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశలలో జరుగుతుందని చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో గల సింథటిక్ ట్రాక్‌పై 1.60 కిలో మీటర్ల పరుగు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు స్పైక్ షూ లేదా కనీసం సాధారణ షూ ధరించడం మంచిదని సూచించారు. తరువాత శారీరక పరీక్షలలో భాగంగా పుల్ అప్స్, జిగ్ జాగ్, 9 అడుగుల లాంగ్ జంప్ తదితర అంశాలలో పరీక్షించి అందులో ఎంపికైన వారికి ఎత్తు, బరువు తదితర శారీరక కొలతల పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. అందులో ఎంపికైన వారికి పేరాగ్రాఫ్ రాయించడం జరుగుతుందన్నారు.
అనంతరం డ్రగ్ పరీక్షలు, మెడికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు వారికి నిర్దేశించిన సమయంలో రిక్రూట్‌మెంట్ ప్రదేశానికి చేరుకోవాలని చెప్పారు. పరుగు ప్రక్రియ అర్ధ రాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థుల శరీరంపై ఎక్కడా ఐదు సెంటిమీటర్లు మించి టాటూలు ఉండరాదని, అయితే గిరిజన తెగలకు మాత్రం వారి ఆచారాల మేరకు వెసులుబాటు ఉంటుందన్నారు.
తుది పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులకు రెండు, మూడు నెలల తర్వాత సులభ మెడికల్ పరీక్షలు నిర్వహించి, నియామకం చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు వారు రిజిస్టర్ చేసుకున్న ఇ – మెయిల్ కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం మౌలిక సదుపాయాలు కల్పనలో సహకరించాలని కోరారు. నాగార్జున విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ డైరెక్టర్ సత్య పాల్ మాట్లాడుతూ అభ్యర్థులు బూట్లు ధరించి పాల్గొనటం మంచిదన్నారు.
కార్యక్రమంలో ఆర్మీ మేజర్ అమర్ దీప్ కుమార్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ హనుమంతు, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా రవాణా శాఖ అధికారి కె.శ్రీహరి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
