
విజేతలుగా నిలిచిన విద్యార్థులతో ప్రిన్సిపాల్ గోపీచంద్, నాగసుశీల, అధ్యాపకులు
విద్యార్థులు భాషా పరిజ్ఞానంతో పాటు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలని జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ అన్నారు. జేకేసీ కళాశాల ఆంగ్లశాఖ ఆధ్వర్యంలో డమ్ షరాడ్స్‌పేరుతో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌స్కిల్స్ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభినయం, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, భావ వ్యక్తీకరణ, గ్రహణశక్తి పెంపొందించుకోవడంలో ఇటువంటి పోటీలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. భాషతో పాటు తెలుగు, ఆంగ్లంలో సామెతలు నేర్చుకోవడంలో పోటీలు దోహదం చేస్తాయన్నారు.
కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్‌ను దూరం చేసి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడటంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకుని, సమాజంలోని వివిధ రంగాల్లో రాణించడంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. పోటీలకు కళాశాల ఆంగ్ల శాఖాధిపతి పి. నాగసుశీల కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించగా, న్యాయనిర్ణేతలుగా పి. గోపీచంద్, డాక్టర్ పాలప్రసాద్, కె.వీణ వ్యవహరించారు. ఈసందర్భంగా వివిధ కళాశాలల నుంచి 90 మంది విద్యార్థులు 45 టీంలుగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలుగా నిలిచిన వి.అంజలి, వై.హేమశ్రీ (విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల), బీజే గాయత్రి, ఎస్వీ పద్మజ (జేకేసీ కళాశాల), కేఎన్ వైష్ణవి, కె.గాయత్రి (ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల), కె.పుల్లారావు, బి.మాధురి (జేసీ లా కళాశాల)కు నగదు బహుమతులతో పాటు కిట్స్ అక్షర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎండీ మొయీన్, షేక్ షాహిస్తా తబస్సుమ్‌కు ప్రత్యేక బహుమతి జ్ఞాపిక, సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
