
మాట్లాడుతున్న ఆర్జేడీ డాక్టర్ కళావతి
గుంటూరు 24-01-2026 శనివారం :
ఎనిమిది దశాబ్ధాలకు పైగా సుదీర్ఘ చరిత కలిగిన ప్రభుత్వ మహిళా కళాశాల విద్యా ప్రమాణాల్లో అగ్రస్ధానంలో నిలిచిందని కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ పి. కళావతి అన్నారు. శనివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల లేడీ హోప్ అల్యూమ్నీ అసోసియేషన్ రజతోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్జేడీ కళావతి మాట్లాడుతూ కోస్తాంధ్రలోనే మొదటి మహిళా కళాశాలగా గుర్తింపు పొందిన మహిళా కళాశాల ప్రగతిలో పూర్వ విద్యార్థినుల సంఘ కషి ఎంతో ఉందన్నారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి మాట్లాడుతూ కళాశాల గౌరవ ప్రతిష్టలకు పూర్వ విద్యార్థినులే పతాకాలుగా ఉంటారని చెప్పారు. గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన కోట్ల రూపాయల వితరణతో అత్యున్నత ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్ది పూర్వవైభవాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో నిర్థేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు.

పూర్వ విద్యార్థినులు బసవపున్నమ్మ, లక్ష్మీతులసమ్మను సత్కరిస్తున్న ఆర్జేడీ కళావతి, ప్రిన్సిపాల్ జోత్స్న కుమారి , పూర్వ విద్యార్థినుల సంఘ ప్రతినిధులు
మాజీ మంత్రి, పూర్వ విద్యార్థిని డాక్టర్ శనక్కాయల అరుణ మాట్లాడుతూ తాను చదువుకున్న కళాశాలను దేవాలయంగా భావిస్తూ నిత్యం కళాశాలకు నమస్కరించి తన వైద్య విధులు నిర్వహిస్తుంటానని చెప్పారు. తమలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్ సర్వెంట్స్, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రమాజ్యోత్సS్న కుమారి మాట్లాడుతూ 28 శాఖలతో చదువుతో పాటు ఉద్యోగాలను కల్పించేస్థాయికి ప్రభుత్వ మహిళా కళాశాల ఎదిగిందని అన్నారు. విద్యార్థినులకు నాణ్యమైనవిద్యాబోధనతో పాటు భాషా, సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల శ్రీకష్ణమూర్తి సతీమణి, కళాశాల పూర్వ విద్యార్థిని అన్నపూర్ణమ్మ కళాశాల అభివద్ధికి రూ.ఐదు లక్షలు, ఆర్బీఐ విశ్రాంత మేనేజర్ పార్వతీ శాస్త్రి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఆర్జేడీ బసవపున్నమ్మ, లక్ష్మీ తులసమ్మను సత్కరించారు.
పూర్వ విద్యార్థినుల ఆత్మీయ పలకరింపులు
పూర్వ విద్యార్థినుల సంఘ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థినులు ఆత్మీ పలకరింపులతో కళాశాల ప్రాంగణం నిండిపోయింది. 1950 నుంచి 2000 సంవత్సరం వరకు వివిధ బ్యాచ్లలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థినులు గత స్మతులను నెమరు వేసుకున్నారు. ఈసందర్భంగా కళాశాల మహిళా సాధికారత విభాగ ఆధ్వర్యంలో విద్యార్థినులు తయారు చేసిన అల్యూమ్నీ సాష్, బ్యాడ్జీలు ధరించి కళాశాల ఆవరణ అంతా కలియతిరిగారు. ఎస్బీఐ అధికారిగా ఉద్యోగ విరమణ చేసిన పూర్వ విద్యార్థిని భరతనాట్యం, ఇతర సాంస్కతి కార్యక్రమాలతో అలరించారు. ఎన్సీసీ కేడెట్లు పూర్వ విద్యార్థినులకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో లేడీ హోప్ అల్యూమ్నీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ డి.ఉమా నిశ్చల్, సభ్యులు సంతోషీ కుమారి, కమల కరుణ, అరుణ, సీవీ రమణి, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
