Home Bhakthiశివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

by subhanih@gmail.com
God Siva with Third Eye

ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యానముద్రలో ఉండగా.. అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి ఆయన రెండు కళ్లు మూసింది. పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు. పార్వతి కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడోనేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. అయితే ఆ కంటి వేడికి పార్వతి చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు జన్మించాడు. అది వేరే కథ.

ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ ఉంది.. ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి, సృష్టి స్థితిలయలకు తోడ్పడమంది. అందుకు వారు
నిరాకరించగా.. ఆగ్రహించి, తన మూడో నేత్రంతో భస్మం చేస్తానంది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి, పొందాడు. ఆ
త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు. ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీ సరస్వతి పార్వతులుగా సృష్టించాడు.

మూడో నేత్రం ప్రత్యేకత ఏంటి అంటే.. అది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం. ఇందుకు నిదర్శనం మన్మథుని కథ. దేవతల ప్రేరణ మేరకు లోకకల్యాణార్థం పూలబాణంతో శివుని మనసులో ప్రణయ భావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మథుడు. తన అంతరంగంలో అలజడికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మథుని అగ్నినేత్రంతో బూడిద చేశాడు. ఇక్కడ గమనించాల్సింది పరమశివుని మూడో కన్ను మన కళ్లలాంటిది కాదు. భౌతిక నేత్రం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు కాక మనకు కావలసినట్టు చూపిస్తుంది. ఇది అర్థం కావాలంటే మన్మథుడు అంటే ఏమిటో తెలియాలి? మన్మథుడు అంటే వ్యక్తి కాదు. మనసును మథించే వాడు మన్మథుడని భావం. అంటే మనసులోని కోరికలన్న మాట. మనసును అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపటలం చేసే అగ్ని రూపమే మూడో కన్ను.

లోకంలో కనిపించే ప్రతి వస్తువు, రుచి, పరిమళం, స్పర్శ.. ఇలా ప్రతిదీ మనకు కావాలనే భావన మనసును మథించినప్పుడు అవి అవసరమా, అనవసరమా అనేది బుద్ధి, విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడోకన్ను. మన్మథుడు మసికావడం అంటే మనలోని కోరిక నశించడం. జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా మనసులో అలజడి రేపిన కోరికలు అవసరమో, లేదో తెలుసుకున్నప్పుడు మనసును మథిస్తున్న మన్మథుని రూపం భస్మమైపోతుంది. అంటే తొలగిపోతుంది. పరమాత్మ స్వరూపమైన మనందరికీ ఆ జ్ఞాననేత్రం ఉంటుంది. కానీ దాన్ని తెరవగలిగే నేర్పు సాధించాలి.
భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితుల్ని దాటి చూడగలగాలి. మనుషులకే కాదు.. దేవతలకు కూడా కష్టతరమైన ఈ జ్ఞానదృష్టి పరమశివుడికి సామాన్యం, సహజం. తనలోని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో దహించాడు శివుడు. తాను దహించినవన్నీ భస్మరూపంలో శరీరం నుంచి బయటకు వచ్చాయి. అంతేకానీ భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవడం కాదు.

యోగపరంగా మన శరీరంలో 72 వేల నాడులు, 114 కూడళ్లుగా ఉంటాయి. అందులో ప్రధానమైన కూడళ్లు ఏడు. వాటినే చక్రాలు అంటారు. యోగసాధనతో ఆ శక్తుల్ని కూడదీసుకొని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కో రకంగా ఉత్తేజితమవుతుంది. ఆ శక్తి ఆజ్ఞాచక్రాన్ని తాకినప్పుడు.. జ్ఞానోదయాన్ని పొంది, దేన్నయినా ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఈ ఆజ్ఞా చక్రాన్నే మూడోకన్నుగా పిలుస్తారు. అలాంటి నిరంతర చైతన్యస్థితిని సహజస్థితిగా ఉంచగలిగిన ఆదియోగి పరమ శివుడు.

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00