
గుంటూరు 28-01-2026 బుధవారం : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీ.జీ.హెచ్)లో గుంటూరు మెడికల్ కాలేజీ ఆలూమినీ ఆఫ్ నార్త్ అమెరికా (జింకానా) సౌబ్రాతృత్వంతో నిర్మించిన కానూరి – జింకానా మాతాశిశు సంరక్షణ భవనంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన ప్రారంభించనున్నారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించుటకు అన్ని పనులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ బుధవారం జి.జి.హెచ్ లో ఎం.సి.హెచ్ బ్లాక్ ను తనిఖీ చేశారు. బందోబస్తు, ట్రాఫిక్, పారిశుధ్యం తదితర అంశాలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఆయా విభాగాల్లో పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డా.ఎస్.ఎస్.వి.రమణ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, డి.ఎస్.పి అజీజ్, జింకానా ప్రతినిధులు బాబుల్ రెడ్డి, రామ కోటేశ్వర రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, ఉప రవాణా కమిషనర్ సీతారాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.