– ఈనెల 29 వరకు వివిధ షిఫ్ట్‌లలో నిర్వహణ
– ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలు
– ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 వరకే అనుమతి
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు వివిధ షిఫ్ట్‌లలో జరగనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లకు ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 21,22,23,24,28వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్), 29న పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. అడ్మిట్‌కార్డులు పొందిన విద్యార్థులు పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 వరకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు.
