
వారమంతా చదువులు, ఉద్యోగాలంటూ బిజీ జీవితాన్ని గడిపేస్తాం. వీకెండ్ వస్తే విశ్రాంతి పేరుతో సగం రోజు నిద్రకే పోతుంది. రోటిన్ పనులతో మిగతా రోజు పూర్తయిపోతుంది. మరుసటిరోజు నుంచి మళ్లీ పరుగు మొదలు. కళ్లు మూసి తెరిచేలోపు వీకెండ్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. చాలామందికి ఇలాగే ఉంటుంది. అయితే.. మనకంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి లభించే ఈ వారాంతాన్ని సంతోషంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడం అలవాటు చేసుకోవాలి.
వీకెండ్ కదా అని.. మధ్యాహ్నం వరకు నిద్ర పోకుండా ఉదయాన్నే లేవండి. కిటికీలు, తలుపులు తెరిచి.. బయటి గాలిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేడివేడి కాఫీ, టీ తాగేస్తే శరీరం ఉత్తేజితమవుతుంది. ఫోన్‌లో మునిగిపోకుండా.. బాల్కనీలో/టెర్రస్‌పై ప్రశాంతంగా కూర్చొని మీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. వారంలో జరిగిన మంచి విషయాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకొని సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి. ఇంట్లోనే వ్యాయామం చేసే బదులు ఈ రోజు నడుచుకుంటూ లేదా సైకిల్‌పై స్థానిక పార్క్‌కి వెళ్లి అక్కడి పచ్చదనాన్ని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మూడ్‌ను రిఫ్రెష్ చేసుకోవచ్చు.
ఇంటికొచ్చి ఫ్రెషప్ అయ్యాక.. బ్రేక్‌ఫాస్ట్‌ను మీరే స్వయంగా సిద్ధం చేయొచ్చు. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనిపిస్తే ఇంటర్నెట్‌లో విభిన్న రెసిపీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన అల్పాహారాన్ని తయారుచేసి మీ పాకనైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఆ తర్వాత కుటుంబసభ్యులతో పిచ్చాపాటిగా ముచ్చటించొచ్చు. వారి జీవితాల్లో ఏం జరుగుతోంది. సమస్యలు ఏమైనా ఉన్నాయా? వారి కెరీర్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? వంటివి అడిగి తెలుసుకోండి. అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వండి.
ఆ తర్వాత మీకు ఆసక్తి ఉంటే.. మధ్యాహ్న భోజనాన్ని మీరే వండొచ్చు. లేదా చేసేవారికి సాయం చేసినా బాగుంటుంది. కలిసి వండుకొని తింటే.. సరదాగా ఉండటమే కాదు, కుటుంబసభ్యులతో ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి. భోజనం చేశాక.. ఇంటిల్లిపాది హాల్‌లో కూర్చొని మంచి సినిమా/వెబ్‌సిరీస్ చూడొచ్చు. సినిమాలు చూడటం ఇష్టం లేకపోతే మీ గదిలోకి వెళ్లి ఎప్పట్నుంచో చదవాలనుకొని చదవలేకపోయిన పుస్తకాన్ని తెరిచి చదవండి. లేదంటే డ్రాయింగ్ వేయడం, మనసులోని మాటలకు అక్షర రూపం ఇవ్వడం, ఫొటోగ్రఫీ వంటివి ప్రయత్నించొచ్చు.
సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో కలిసి సరదాగా వాకింగ్‌కు వెళ్లండి. మార్కెట్‌కు వెళ్లి వారానికి సరిపడా సరుకులు/కూరగాయలు కొనొచ్చు. లేదంటే షాపింగ్ చేయండి. ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు కలిగే ఆనందం కొన్ని రోజులపాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ తర్వాత బయటే స్నాక్స్ తినేసి ఇంటికి వచ్చేయొచ్చు. స్నేహితులను ఇంటికి ఆహ్వానించి వారితో కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రి భోజనం చేశాక చక్కటి మ్యూజిక్ వింటూ తొందరగా నిద్రకు ఉపక్రమించండి. అప్పుడే మరుసటి రోజు ఉదయాన్నే లేచి హుషారుగా ఆఫీసు/కాలేజీలకు బయలుదేరొచ్చు. ప్రతివారం ఇలా చేయలేకపోయినా.. అప్పడప్పుడు వీకెండ్‌ను ఇలా ప్లాన్ చేసి చూడండి.