gunturnews.in

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలోని ప్రజలు సైబర్‌ నేరాలు, డిజిటల్‌ అరెస్ట్‌ వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రజల్లో కొంతమేర చైతన్యం వచ్చిందన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. సీనియర్‌ సిటిజిన్లకు వాట్సాప్‌ కాల్స్‌ చేసి, మనీ లాండరింగ్‌ కేసులు ఉన్నాయని, డబ్బులు డిపాజిట్‌ చేయాలని బెదిరిస్తుంటారని అన్నారు. అటువంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే సైబర్‌ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

అంతే గాక సీనియర్‌ సిటిజన్లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు వాట్సాప్‌ కాల్స్‌ చేసి సీబీఐ పోలీసులమని చెబుతుంటారని అన్నారు. మొబైల్‌ఫోన్ల ద్వారా అశ్లీల ఫోటోలు పంపినట్లు కేసు నమోదైందని, పేరు తొలగింపునకు డబ్బులు డిపాజిట్‌ చేయాలని బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే సైబర్‌ పోలీసులను సంప్రదించాలని అన్నారు. సైబర్‌ మోసగాళ్లు పోలీస్, కోర్టు, కస్టమ్స్, టెలికాం అధికారులమని వాట్సాప్‌ కాల్స్‌ చేసి, నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు చూపించి డిజిటల్‌ అరెస్ట్‌ అని భయపెడతారని తెలిపారు. అరెస్ట్‌లు నుంచి తొలగించేందుకు నగదు పంపించాలని ఒత్తిడి చేస్తారని, అటువంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు మొబైల్‌ ఫోన్లు లేదా వాట్సాప్‌ కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయరని స్పష్టం చేశారు. అదే విధంగా ఎటువంటి లింక్‌లను ఓపెన్‌ చేసి నగదు పంపించవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్‌ వస్తే వెంటనే కట్‌ చేయయాలని, అటువంటి ఫోన్లు వస్తే 1930కు కాల్‌ చేయాలని తెలిపారు.

Exit mobile version