
ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేసే లెక్చరర్‌కు.. బ్యాంకు లోగో డీపీగా ఉన్న వాట్సప్ నంబరు నుంచి సందేశం వచ్చింది. మీ పాన్‌కార్డు అప్‌డేట్ చేయాల్సి ఉందన్నది దాని సారాంశం. అందులోని లింక్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇది నిజమేనని నమ్మి లింక్‌ను క్లిక్ చేసి.. అకౌంట్, మొబైల్ నంబరు, డెబిట్ కార్డు పిన్, గ్రిడ్ నెంబర్లు, పాన్ కార్డు వివరాలను నమోదుచేశారు. కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.11 లక్షలు క్రెడిట్ అయినట్లు అతడి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఇంకాసేపట్లో రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.లక్ష చొప్పున డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది. ఆగమేఘాల మీద బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్లు, మంజూరు కాగానే.. ఆ మొత్తం వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు సిబ్బందిచెప్పారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడికి ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీకు క్రెడిట్ కార్డు పంపించాం.. వచ్చిందా?’ అని అడిగాడు. తనకు అవసరం లేదని చెప్పగానే.. కార్డు క్లోజ్ చేయాలంటే కొన్ని వివరాలు కావాలని అవతలి వ్యక్తి అడిగాడు. సరే అని పాన్ నంబరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ వివరాలు చెప్పాడు. అనంతరం ఓటీపీ వివరాలను కూడా చెప్పాడు. తర్వాత కొద్ది సేపటికే పర్సనల్ లోన్ కోసం చేసిన దరఖాస్తు స్వీకరించినట్లు వచ్చిన మెయిల్ చూసి యువకుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మరుసటి రోజే అతడి బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యాయి. అనంతరం ఆ మొత్తం వేరే ఖాతాకు బదిలీ అయిపోయింది.
డిజిటల్ సాంకేతికత పెరగడంతో ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఫోన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాలు ఎంతగా పెరుగుతున్నాయో అంతే వేగంగా సైబర్ నేరాలూ చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అయితే ఒక రకమైన సైబర్ నేరం గురించి జనాలకు అవగాహన పెరగగానే ఈ నేరగాళ్లు సరికొత్త విధానానికి తెరలేపుతున్నారు. అందులో భాగంగానే వ్యక్తిగత రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వైనం బెంబేలెత్తిస్తోంది.
మోసం చేసే విధానం..
మన వివరాలు తెలుసుకుని.. మన ప్రమేయం లేకుండానే రుణాలకు దరాఖాస్తు చేసి.. మంజూరైన తర్వాత, ఆ మొత్తాన్ని ఇతర ఖాతాలకు దారి మళ్లించేస్తున్నారు. దీని నుంచి తేరుకునే లోగానే అంతా అయిపోతోంది. ఇలా కొత్త పంథాలో మొదలైన మోసాలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లే ఆధారం
సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీలు, వారి సిబిల్ స్కోర్‌ల ఆధారంగా రుణాలిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఎటువంటి తనిఖీలు లేకుండానే ఖాతాదారులకు నిమిషాల వ్యవధిలో రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తి స్థాయిని బట్టి మొత్తాన్ని ఆమోదిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత పరిమితి ఉంది? తదితర వివరాలను మోసగాళ్లు వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంటున్నారు. వాటి ఆధారంగా ఆ వ్యక్తి నుంచి కొన్ని వివరాలు రాబడుతున్నారు. అనంతరం ఇంటర్‌నెట్, మొబైల్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయ్యి రుణం కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ డబ్బులు ఖాతాలో జమ కాగానే ఇతర అకౌంట్లకు మళ్లిస్తున్నారు.
వెంటనే అప్రమత్తం కావాలి
మోసం బారిన పడితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించాలి. ఖాతాను ఫ్రీజ్ చేయించాలి.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కానీ, 1930కు ఫోన్ చేసి కానీ ఫిర్యాదు చేయాలి.
సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆధారాలతో ఫిర్యాదు చేయాలి.
నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకు యాప్‌లో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి.
తరచూ బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలిస్తుండాలి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే.. అప్రమత్తం కావాలి