gunturnews.in

యూటీఎఫ్‌ ఉద్యమనేత టి. అంజిరెడ్డి మృతి
– నేడు జీజీహెచ్‌కు భౌతికకాయం అప్పగింత

అంజిరెడ్డి భౌతికకాయంపై యూటీఎఫ్‌ పతాకాన్ని కప్పుతున్న రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కేఎస్‌ లక్ష్మణరావు, నాయకులు

ఉపాధ్యాయ ఉద్యమంలో చివరి దాకా నిలబడి యూటీఎఫ్‌ ఆవిర్భావానికి క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమ నేత అంజిరెడ్డి మృతి ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్రమైన లోటు అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు అన్నారు.

పెదకాకాని మండలం నంబూరులో విశ్రాంత ఉపాధ్యాయుడు, యూటీఎఫ్‌ ఉద్యమనేత టి. అంజిరెడ్డి (96) ది.21-01- 2026 న మృతి చెందారు. యూటీఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గ్రామంలోనే నివాసముంటూ, ప్రజాతంత్ర ఉద్యమాలకు సహకారాన్ని అందించారని, తద్వారా యువకుల్లో చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేసే వారని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పాటు యూటీఎఫ్‌ ఉద్యమ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే ప్రజలందరికీ విద్య, తద్వారా ప్రజా చైతన్యం ప్రశ్నించే తత్వం అలవాడతాయని అందరూ చదువుకోవాలని ఆకాంక్షించారని కొనియాడారు. తాను పనిచేసిన, చదివిన పాఠశాలకు లక్షలాది రూపాయలు దానంగా ఇచ్చి పాఠశాల అభివద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కషి చేశారని చెప్పారు. గుంటూరు జిల్లాతోపాటు రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో సైతం తనకంటూ ఒక పేజీని లిఖించుకుని ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమూర్తిగా నిలిచారని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రైతాంగ, ప్రజాతంత్ర ఉద్యమంలో పనిచేస్తూ తన తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు.

కాగా తన మరణానంతరం భౌతికకాయం సైతం సమాజానికి ఉపయోగపడాలనే ఆశయంతో అంజిరెడ్డి ముందస్తు కోరిక మేరకు అంత్యక్రియలకు దూరంగా ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు గుంటూరు మెడికల్‌ కళాశాలకు అప్పగించనున్నారు. నివాళులర్పించిన వారిలో యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్‌ ఎం. హనుమంతరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌ రావు, ఎం. కళాధర్, జిల్లా నాయకులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, సీహెచ్‌ ఆదినారాయణ, టి.ఆంజనేయులు, ఏ.శ్రీనివాసరావు, కె.రంగారావు సీనియర్‌ నాయకులు కె.జోజయ్య, కేఎస్‌వీ దుర్గారావు, జి.ప్రభుదాస్, ఎన్‌.తాండవ కష్ణ, టి.వినోద్,
బి.ఆదిలక్ష్మి ఉన్నారు.

Exit mobile version