
మీ సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సంపాదన అంతా ఆవిరైపోతుంది. అలాగే డబ్బు విషయంలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని ఆర్థింగా బలహీన పరచడమే కాక అప్పు చేసే స్థితికి తీసుకెళ్తాయి. అలాంటి కొన్ని బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు
చాలామంది మనీ-బ్యాక్ పాలసీలకు ఆకర్షితులయ్యి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ స్కీములు తీసుకుంటుంటారు. వీటివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇన్సూరెన్స్ పాలసీలు మంచివే అయినా.. వీటి విషయంలో జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక భద్రత ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ లు మాత్రమే తీసుకోవాలి.
2. లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్
చాలామంది తెలియకుండానే సంపాదనకు తగ్గట్టు లైఫ్ స్టైల్ ను మారుస్తుంటరు. అయితే కొన్నిసార్లు లిమిట్ దాటుతుంది. అవసరం లేకపోయినా కొత్త ఫోన్లు, పెద్ద కార్లు లేదా ఖరీదైన వస్తువుల కోసం అతిగా ఖర్చు చేస్తుంటారు. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ ఫ్లేషన్ అంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఇది మీ పొదుపు పెరగకుండా అడ్డుకుంటుంది. మీరు ఫైనాన్షియల్ గా ఒకేచోట చిక్కుకుపోతారు. అందుకే ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కాకుండా మీ పెట్టుబడులు పెంచుకునే ప్రయత్నం చేయాలి.
3. క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు వాడకంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడడం, బిల్లు కట్టే సమయంలో మినిమం డ్యూ కట్టడం వంటివి మీకు తెలియకుండా మీపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతాయి. అందుకే వీలైనంత వరకూ ఒకట్రెండు క్రెడిట్ కార్డులకు పరిమితం అవ్వాలి. బిల్లులు సకాలంలో చెల్లించాలి.
4.కో-సైనర్‌గా మారడం
స్నేహితులు లేదా బంధువులను నమ్మి వారి రుణాలకు హామీదారుగా (Co-signer)గా సంతకం చేయడం చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి EMIలు కట్టడం ఆపేస్తే, అది మీ CIBIL స్కోర్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు చట్ట ప్రకారం ఆ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా మీపై పడొచ్చు. కాబట్టి ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
5. భారీ లోన్స్ తీసుకోవడం
కొంతమంది ఇల్లు లేదా కారు వంటివి కొనడం కోసం పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకుంటారు. అలాగే వాటికోసం పదేళ్ల పాటు EMI టెన్యూవర్ పెట్టుకుంటారు. దీనివల్ల మీ నెలవారీ జీతంలో దాదాపు సగం మొత్తం ఆ EMIలకే ఖర్చవుతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ లో మీరు పొదుపు చేయలేరు. కాబట్టి పెద్ద లోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కట్టే EMIల మొత్తం.. ఆదాయంలో 25 నుంచి 30 శాతం మించకుండా చూసుకోవాలి.