
– ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక
– జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు: 490
– పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు: 27,260
– జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు: 149
మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు తదేక దీక్షతో సన్నద్దమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పరీక్షల్లో అధిక మార్కుల సాధన దిశగా వారిపై శ్రద్ద చూపిస్తున్నారు. గుంటూరుజిల్లాలోని 490 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్దమవుతున్న 27,260 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.పరీక్షల్లో అధిక మార్కుల సాధన కోసం జిల్లా ప్రజా పరిషత్ ద్వారా ముద్రించిన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేశారు.