
అవగాహన కల్పిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి
సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూ ఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వం మీద 40 గంటల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు శిక్షణా తరగతులు జరుగనున్నాయి. కార్యక్రమానికి శిక్షకులుగా సుప్రీం కోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ కేరళ నుండి లాల్ వారియర్ అడ్వకేట్, మధ్యప్రదేశ్ నుండి మిస్ నీనా ఖరే అడ్వకేట్‌లను నియమించారు. ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమ ప్రారంభోత్సవంలో శిక్షకులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్‌లు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూరి సాయి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అనుకున్న స్థాయిలో జరగడం లేదన్నారు. దానికి న్యాయబద్దమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం లో స్థిరాస్తి, వివాహ సంబంధ వివాదాల, వాణిజ్య పరమైన వివాదాలు ప్రధమ స్థాయి లోనే పరిష్కరించడం తేలికని తెలిపారు. భవిష్యత్తులో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. శిక్షణకు వచ్చిన న్యాయవాదులందరూ మధ్యవర్తిత్వంలో నైపుణ్యాన్ని పెంచుకొని సుప్రీం కోర్టు అంచనాలకు తగినట్టు మధ్యవర్తిత్వంలో భాగస్వాములు కావాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం మధ్యవర్తిత్వాన్ని సమర్ధవంతంగా, సులభతరం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అధునాతన పద్దతులలో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మొదటి రోజు శిక్షణా కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు సంబందించిన న్యాయవాదులు మొత్తం 33 మంది పాల్గొన్నారు.