
ఫైనాన్షియల్ ప్లానింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ జీవితానికి ఒక భరోసా ఉండాలంటే తప్పకుండా ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అయితే వీటిలో చాలా రకాల పాలసీలు ఉంటాయి. సరైన పాలసీని ఎంచుకోవాలంటే ముందు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మీకు ఎంత కవరేజీ అవసరం?
టర్మ్ ఇన్సూరెన్స్(term insurance) లో కేవలం ప్రొటెక్షన్ మాత్రమే లభిస్తుంది. పాలసీదారుడు టర్మ్ పూర్తయేవరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీపై ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే అధిక కవరేజీ ఉన్నప్పటికీ, ప్రీమియం తక్కువగా ఉంటుంది. అందుకే మీ మొత్తం కవరేజీపై సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అప్పులు, పెళ్లి లేదా ఇల్లు కొనుగోలు వంటి భవిష్యత్తు ప్లాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కవరేజీని నిర్ణయించాలి. మీ వయసుని బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ కవరేజీ ఎంచుకోవచ్చు. ఒక బేసిక్ రూల్ ఏంటంటే.. మీ ప్రస్తుత వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు ఎక్కువ కవరేజీని ఎంచుకోవడం మంచిది.
2. తక్కువ వయసులోనే తీసుకోండి!
మీ ప్రీమియంను నిర్ణయించేవాటిలో వయసు ముఖ్యమైనది. మీరు ఎంత చిన్న వయసులో, ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. మీరు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉంటే రూ.2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తక్కువ ప్రీమియంకే లభిస్తుంది. ఏళ్ల పాటు మీరు తక్కువ ప్రీమియం రేటును పొందవచ్చు.
3. టెన్యూవర్ తెలివిగా ఎంచుకోండి!
మీ పాలసీ టెన్యూవర్ కూడా మీ వయసుకి సరిపోయేలా చూసుకోండి. అలాగే మీపై ఆధారపడిన వారి వయసుని కూడా పరిగణలోకి తీసుకోండి. చాలామంది 60 నుంచి 65 ఏళ్ల వరకూ పాలసీని తీసుకుంటారు. అది మంచిదే. పాలసీ టెన్యూవర్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా.. ఎక్కువ కాలం ఆర్థిక రక్షణ ఉంటుంది.
4. రైడర్ బెనిఫిట్స్ మర్చిపోవద్దు!
రైడర్‌లు అంటే మీ ప్రధాన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చబడే అదనపు అంశాలు. ఇవి మీ రక్షణను మరింత పెంచుతాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్(ప్రమాదకరమైన వ్యాధి బారిన పడినప్పుడు కవరేజ్ అందుతుంది), యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్(ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే అదనపు ప్రయోజనం లభిస్తుంది), వేవర్ ఆఫ్ ప్రీమియం (వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యానికి గురైతే, తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు).
5. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో!
పాలసీని ఎంచుకునే ముందు ఆ సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోని (CSR) తప్పకుండా చెక్ చేయాలి. అద్భుతమైన CSR ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ, క్లెయిమ్‌లను త్వరగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కరిస్తుందని అర్థం.
6. పే అవుట్ ఆప్షన్స్!
ఇక కవరేజ్ చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం కవరేజీ ఒకే చెల్లింపులో రావొచ్చు లేదా నెలవారీ ఆదాయం వచ్చే ఆప్షన్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
7. నిజాయితీగా సమాచారం ఇవ్వండి!
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్యం, మెడికల్ హిస్టరీ గురించి పూర్తిగా, నిజాయితీగా వివరాలు అందించండి. మీ సమాచారాన్ని దాచడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
