
ప్రేమ, వివాహబంధాలు మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ, కాలం గడుస్తున్నకొద్దీ .. భాగస్వామి ప్రవర్తనలో మార్పులు, లక్షణాలు ఇద్దరిలో మనస్పర్థలు తీసుకురావడమే కాదు.. వారి మధ్య దూరాన్నీ పెంచుతాయి. ముఖ్యంగా ఈ విషయాలే జంటల మధ్య గొడవలకు కారణమవుతాయని, అవే విడిపోయేవరకు తీసుకెళ్తాయని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అవేంటి.. వాటిని ఎలా అధిగమించి.. కలిసిఉండాలో తెలుసుకుందాం.
చిన్నచూపు
ఏదైనా విషయం గురించి నలుగురిలో చర్చిస్తున్నప్పుడు.. నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడకు, నీకు సంబంధం లేని విషయం అంటూ భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలా చేసినప్పుడు వారు ఆత్మన్యూనతకు, అగౌరవానికి గురవుతారు. తరచూ అలాగే చేశారంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
ఏం చేయాలి?
ఒకరినొకరు గౌరవించుకోవాలి. ముఖ్యంగా నలుగురిలో భాగస్వామిని అస్సలు అగౌరవపరచొద్దు. ఏదైనా విషయంపై విభేదిస్తే కూర్చొని శాంతంగా మాట్లాడుకోవాలి. తెలియని విషయాలుంటే అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగానీ, చెప్పినా అర్థం కాదులే అంటూ కసురుకోవద్దు.
గతం
దంపతుల మధ్య వాగ్వాదం సాధారణమే. తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ, అందులో గతంలో జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తుంటారు. ప్రస్తుత అంశాన్ని వదిలేసి ఆ తప్పుల్ని వేలెత్తి చూపుతూ గొడవకు దిగుతారు. దీంతో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి ఒకరినొకరు ద్వేషించుకునే వరకు వెళ్తారు. చాలామంది చేసే పొరపాటిది.
ఏం చేయాలి?
గతం గతః.. గతంలో జరిగిన విషయాలను అప్పుడే మర్చిపోవాలి. ఏదైనా అంశంపై వాదిస్తున్నప్పుడు వాటిని తిరిగి తోడకూడదు. ప్రస్తుతం పైనే దృష్టి పెట్టి.. సమస్యలకు పరిష్కారం ఆలోచించాలి.
అంచనాలు
తమ భాగస్వామిపై కొందరు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. తాను చెప్పకుండానే షాపింగ్, డిన్నర్‌కి తీసుకెళ్లాలి, సినిమా చూపించాలి, సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వాలి. ఇలా కొన్ని అంచనాలు ఉంటాయి. అలా జరగకపోయేసరికి తీవ్ర నిరాశకు గురవుతారు. అది కోపాన్ని, చిరాకును పెంచి.. ఇద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది.
ఏం చేయాలి?
వీలైనంతవరకు అంచనాలు పెట్టుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. అనుకున్నది జరిగితే సంతోషమే.. జరగకపోయినా.. వీలు కాలేదేమో, మరిచి పోయారేమోననే సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. కోపం తెచ్చుకోవద్దు.
తప్పులు
కొందరు ప్రతీ విషయంలోను భాగస్వామిలోని తప్పులు వెతుకుతుంటారు. చెప్పింది సరిగా చేయలేదు, వంట బాగా లేదు, ఇలా ఎవరైనా చేస్తారా? అని సూటిపోటి మాటలు అంటుంటారు. ఇలాంటివి చేస్తే.. ఎదుటి వ్యక్తి బాధ పడటమే కాదు.. మనస్ఫూర్తిగా మాట్లాడటం మానేస్తారు. క్రమంగా దూరమవుతారు.
ఏం చేయాలి?
అందరూ తప్పులు చేస్తారు. అంతమాత్రాన వారిని నిందించి, మాటలు అనడం సరికాదు. ముఖ్యంగా భాగస్వామి ఏదైనా తప్పు చేస్తే.. నొప్పించకుండా వివరించి.. సరిదిద్దుకునేలా చేయాలి. మరోసారి జరగక్కుండా చూసుకోమని ప్రేమగా చెప్పాలి.
పోల్చడం
‘నువ్వు వారిలా ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నావు?’.. ‘నువ్వు ఎందుకు వీరిలా అందంగా రెడీ అవ్వట్లేదు?’.. ఇలా ఇతరులతో పోల్చుతూ మాట్లాడుతుంటారు. ఇలా చేస్తే భాగస్వామి మనసు నొచ్చుకుంటుంది. ఎంత చేసినా వ్యర్థమే అన్న ఫీలింగ్‌కి వచ్చేస్తారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రమై అగాధం ఏర్పడుతుంది.
ఏం చేయాలి?
ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. ఎవరి శక్తిసామర్థ్యాలు, వ్యక్తిత్వాలు వారివి. అందుకే ఎప్పుడూ, ఎవరినీ ఇతరులతో పోల్చకూడదు. భాగస్వామిలో నచ్చని విషయాలు ఉంటే వివరించి.. మార్చుకోమని శాంతంగా చెప్పాలి.
ఆధిపత్యం
ఒకరి అభిప్రాయానికే కట్టుబడి ఉండటం, ఒకరి ఇష్టాయిష్టాలకు తగినట్లుగానే మరొకరు ప్రవర్తించడం.. ఇలా కొన్ని జంటల్లో ఒకరి ఆధిపత్యమే నడుస్తుంటుంది. భాగస్వామికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వరు. ఇవి భరించలేని స్థాయికి చేరినప్పుడు.. గొడవలు మొదలవుతాయి. జంటలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఏం చేయాలి?
ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. మీకేం కావాలో చెప్పి చేయించుకోవడంతోపాటు.. వారికి ఏం కావాలో తెలుసుకొని చేసి పెట్టాలి. వారికంటూ వ్యక్తిగత సమయం ఇవ్వాలి.
నిర్లక్ష్యం
ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల ఒత్తిళ్లతో భాగస్వామిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. వారి ఉనికిని గుర్తించరు. దీంతో వారిలో ఒంటరిననే భావన కలుగుతుంది. మౌనంగా ఉండిపోతారు. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గి, దూరం పెరుగుతుంది.
ఏం చేయాలి?
ఎంత బిజీగా ఉన్నా.. భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాలి. బయటకు వెళ్తే ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇంట్లో ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం, పక్కన కూర్చొని ముచ్చటించడం చేయాలి