కారణాలు ఇవీ..

కండరాలు బిగుసుకోవటం: వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు,
స్నాయువులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు
పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్లు, భుజాల నొప్పులు ఎక్కువవుతాయి.

రక్త ప్రసరణ తగ్గటం: చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు,
ఎముకలకు రక్తం అందటం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టటానికి బీజం
పడినట్టే. కీళ్లు, కండరాలు కోలుకోవటమూ మందగిస్తుంది.

విటమిన్‌ డి పడిపోవటం: శీతకాలంలో ఎండ కాయటం తగ్గుతుంది. ఒంటికి తగినంత ఎండ తగలకపోతే
విటమిన్‌ డి మోతాదులూ పడిపోతాయి. ఇది కీళ్లు, నడుం నొప్పులతో పాటు నిస్సత్తువ ఎక్కువ కావటానికీ దారితీస్తుంది.
పాత గాయాలు ఉద్ధృతం: పాత గాయాలతో చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు చలి మూలంగా మరింత నొప్పి కలిగేలా చేస్తాయి.

కీళ్లవాపు తీవ్రం: వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతుంటాయి. దీంతో కీళ్లు
బిగుసుకోవటం, వాపు, నొప్పి కలుగుతుంది. ఇవి చలికాలంలో మరింత ఎక్కువవుతాయి.
కదలకుండా ఉండటం: బయట చలిగా ఉండటం వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోవటానికి
ఇష్టపడుతుంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కండరాలు బలహీనపడతాయి,
బిగుసుకుంటాయి. ఇవి నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి.

ఎలా తగ్గించుకోవాలి?

దుప్పటి కప్పుకోవటం, నొప్పి ఉన్నచోట వేడి కాపు పెట్టటం, గోరువెచ్చటి
నీటితో స్నానం చేయటం ద్వారా కండరాల బిగువు సడలేలా చూసుకోవచ్చు.

ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు
చేయాలి. ముఖ్యంగా మెడ, వీపు, తొడలు, పిక్కలు సాగదీయటం మీద దృష్టి పెట్టాలి.

ఆరు బయట ఎండ కాస్తున్నప్పుడు నడవటం, ఇంట్లో సైకిల్‌ తొక్కటం మంచిది. తేలికైన యోగాసనాలూ
మేలే. ఇవి రక్త ప్రసరణ పుంజుకోవటానికి, బిగువు తగ్గటానికి తోడ్పడతాయి.

చలికాలంలో తగినంత నీరు తాగకపోవటం వల్ల ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. ఇది
నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 6-8 గ్లాసుల నీరు తాగాలి.

నొప్పిని తగ్గించే పూత మందులు రాసుకోవటం, గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకోవటం ఉపయోగపడతాయి.
అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు పారాసిటమాల్‌ వంటి నొప్పి మందులు వేసుకోవాలి.

చేతులకు గ్లౌజులు, మోకాళ్లకు క్యాప్స్, ఉన్ని సాక్స్‌ ధరించటం ద్వారా కీళ్లు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

డాక్టర్‌ వద్దకు ఎప్పుడు?

నొప్పి విడవకుండా వేధిస్తున్నా, కీళ్లలో వాపు లేదా ఎరుపు తలెత్తినా, నడవటం లేదా
పడుకోవటానికి నొప్పి ఇబ్బంది కలిగిస్తున్నా, చేతులు లేదా కాళ్లలో పొడుస్తున్నట్టు గానీ మొద్దుబారినట్టుగానీ అనిపిస్తున్నా వెంటనే డాక్టర్‌ను
సంప్రదించాలి.

Share.
Leave A Reply

Exit mobile version