చలికాలమంటేనే శీతగాలి కోత. అదీ పొడిగాలి తాకిడి. దీంతో చర్మం తేమను కోల్పోతుంది. మరోవైపు చర్మంలో సహజ నూనె ఉత్పత్తీ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. చివరికి చర్మం మీది రక్షణ పొర సైతం దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం కళ కోల్పోవటమే కాదు.. కొన్ని సమస్యలూ ముంచుకొస్తాయి. అప్పటికే ఉన్న సోరియాసిస్, ఎగ్జిమా వంటివీ ఉద్ధృతమవుతుంటాయి. మరి చలికాలంలో వీటిని అదుపులో ఉంచుకునేదెలా? చర్మం మరింత దెబ్బతినకుండా చూసుకునేదెలా? తెలుసుకుందాం పదండి.

సోరియాసిస్ పొలుసుల బెడద
చర్మాన్ని పొలుసులు పొలుసులుగా.. పొట్టుపొట్టుగా రాలగొట్టే సోరియాసిస్ దీర్ఘకాల సమస్య. రాలిపోయే వాటి కన్నా కొత్త చర్మకణాలు ఎక్కువగా పుట్టుకురావటమే దీనికి మూలం. చలికాలంలో చర్మం పొడిబారటం వల్ల ఇది ఉద్ధృతమవుతుంటుంది కూడా. నూటికి 80 మందిలో ఇలాంటి పరిస్థితిని గమనిస్తుంటాం.
జాగ్రత్తలు ఇవీ..
వేడినీటితో స్నానం చేస్తున్నప్పుడు హాయిగానే ఉంటుంది. కానీ ఇది చర్మంలోని నూనెను తొలగిస్తుంది. దీంతో చర్మం పొడిబారటం ఎక్కువుతుంది. ఇది రోజంతా చర్మాన్ని చికాకు పరుస్తూనే వస్తుంది. కాబట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. చల్లటి నీరైతే ఇంకా మంచిది.
మరీ ఎక్కువసేపు స్నానం చేయొద్దు. టబ్ స్నానమూ పనికిరాదు. శరీరానికి సబ్బు రుద్దుకొని, దాన్ని కడిగేసుకునేంత వరకే బాత్రూమ్‌లో ఉండాలి.
స్నానానికి నురగ తక్కువగా వచ్చే సబ్బు వాడుకోవాలి. పొలుసులు పోతాయని బలంగా రుద్దటం తగదు. రుద్దినకొద్దీ పొలుసులు వస్తూనే ఉంటాయి. స్నానం చేశాక తువ్వాలును సున్నితంగా అద్దుతూ తుడుచుకోవాలి.
తడిగా ఉన్నప్పుడే ఒంటికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అప్పుడు చర్మానికి, మాయిశ్చరైజర్‌కు మధ్య నీటి పొర ఏర్పడుతుంది. అది చర్మంలోకి చేరుకొని, పొడిబారకుండా కాపాడుతుంది. అనంతరం డాక్టర్ సిఫారసు చేసిన స్టిరాయిడ్ క్రీముల వంటివి రాసుకుంటే మరింత ఫలితం కనిపిస్తుంది.
చలికాలంలో ఎండ తగిలితే బాగానే ఉంటుంది. కానీ సొరియాసిస్ గలవారు మరీ ఎక్కువసేపు.. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత ఎండలో ఉండొద్దు. అదేపనిగా చర్మానికి ఎండ తగిలితే అతినీలలోహిత కిరణాల ప్రభావంతో ఎక్కువగా చికాకుకు గురవుతుంది. ఉదయం 10 గంటలోపు కాస్త ఎక్కువసేపు కూర్చున్నా ఇబ్బందేమీ ఉండదు. ఏదేమైనా ఎండలోకి వెళ్లినప్పుడూ ఒంటికి మాయిశ్చరైజర్ రాసుకోవటం మంచిది.
చలికాలంలో లభించే చిలగడ దుంపలు తినటం మేలు. వీటిల్లోని విటమిన్ ఏ సమస్య ఉద్ధృతం కాకుండా కాపాడుతుంది.
చలిగాలి చర్మాన్ని చికాకు పరచి, సోరియాసిస్ ఉద్ధృతమయ్యేలా చేస్తుంది. కాబట్టి ఒంటికి చలిగాలి తగలకుండా చూసుకోవాలి. అయితే నూలు దుస్తులు ధరిస్తే మంచిది. చర్మాన్ని చికాకు పరచే పట్టు, నైలాన్ దుస్తులు వద్దు. అలాగే స్వెట్టర్, ఉన్ని దుస్తులను నేరుగా చర్మానికి తగలనీయొద్దు. నూలు దుస్తుల మీద స్వెట్టర్ ధరించాలి.
చలి పెడుతోందని వ్యాయామాన్ని పక్కన పెట్టొద్దు. వ్యాయామం చేస్తే సోరియాసిస్ తగ్గుముఖం పడుతుందని గుర్తించాలి. అయితే వ్యాయామం చేయటానికి వెళ్లేముందు శరీరానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. లేకపోతే చల్లగాలికి చర్మం మరింత పొడిబారే ప్రమాదముంది.
చలికాలంలో మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. ఇవీ సోరియాసిస్ మరింత ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. కాబట్టి యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం.

చుండ్రు పొడి పొడిగా
తలలో చుండ్రుతో బాధపడేవారిలో మాడు అప్పటికే పొడిగా ఉంటుంది. చలికాలంలో ఎక్కువ షాంపూలు వాడటం వల్ల మరింత ఎక్కువవుతుంది. తలంతా పొట్టు రాలుతున్నట్టుగా కనిపిస్తుంది. కొందరు దీన్ని సోరియాసిస్ అనీ భయపడుతుంటారు. సోరియాసిస్ గలవారిలో తలలో అక్కడక్కడా పొలుసులు వస్తుంటాయి. కానీ చుండ్రు సమస్య తల నిండా కనిపిస్తుంటుంది.
ముందు తలకు నూనె రాసుకొని.. నురుగు తక్కువగా వచ్చే బేబీ షాంపూతో తలస్నానం చేయాలి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. వీలైతే స్నానానికి తాగునీరు వాడుకోవాలి. కఠిన జలంతో చుండ్రు మరింత ఎక్కువయ్యే అవకాశముంది మరి.
జుట్టుకు రంగు వేసుకునేవారు రసాయనాలు లేని రంగులు వాడుకోవాలి.
చుండ్రు తగ్గటానికి పోషకాహారం తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రొటీన్ తగినంత తీసుకోవాలి. గుడ్డు తెల్లసొన, మొలకలతో మంచి ఫలితం కనిపిస్తుంది.

జుట్టు రాలటం కాలం మార్పు
కాలాలు మారినప్పుడు కొందరికి జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది. దీనికి కారణం శరీరంలో జీవక్రియ తీరు మారటం.
చలికాలంలో జుట్టు రాలుతున్నట్టు గమనిస్తే ఉడికించిన గుడ్డు తినటం మంచిది. శాకాహారులైతే అన్నిరకాల పండ్లు, కూరగాయలు తినాలి. ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మేలు.
రాగి జావ తాగాలి.
కెఫీన్‌తో కూడిన షాంపూ, ప్రొటీన్ సీరమ్స్ వాడుకోవాలి.
చలికాలం పోయాక రాలిన జుట్టు తిరిగి వస్తుంది. కాకపోతే నిబ్బరంగా ఉండాలి. అప్పటివరకూ బయోటిన్, విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి. పోషకాహారం మీద శ్రద్ధ పెట్టాలి.
చలికాలం పోయినా వెంట్రుకలు రాలుతున్నట్టయితే విటమిన్ మాత్రలు అవసరమవుతాయి. జుట్టుకు కెఫీన్ షాంపూలు, రెడిన్సెల్ సీరమ్స్ మేలు చేస్తాయి. ఇవి జుట్టు రాలటాన్ని నివారిస్తాయి.
అటోపిక్ ఎగ్జిమా జన్యుపరంగా
జన్యుపరంగా కొందరు ఏనుగు గజ్జి (అటోపిక్ ఎగ్జిమా)తో ఇబ్బంది పడుతుంటారు. దుమ్ము, ఆహార అలర్జీల వంటివి గల కుటుంబాల్లో దీన్ని చూస్తుంటాం. తల్లిదండ్రులిద్దరికీ ఇది ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి కారణమయ్యే జన్యువు గలవారిలో సాధారణంగా మూడు నెలల వయసు నుంచి మూడేళ్ల వరకూ ఎప్పుడైనా మొదలవ్వచ్చు. వీరిలో మోకాళ్లు, మోచేతులు, కీళ్లు, మెడ, బుగ్గల మీద విపరీతమైన దురద, మంట తలెత్తుతాయి. కొందరికి గజ్జల్లోనూ రావొచ్చు. చర్మంలోని మూడో పొరలో నూనె ఉత్పత్తి అవుతుంది. జన్యుపరంగా వీరిలో ఈ ప్రక్రియ కొరవడుతుంది. దీంతో చర్మం పొడి బారుతూ వస్తుంది. చలికాలంలో అటోపిక్ ఎగ్జిమా బాధలు మరింత పెరుగుతాయి.
సాధారణంగా అటోపిక్ ఎగ్జిమా (డెర్మటైటిస్) జీవితంలో మూడు సార్లు.. 3 నెలల నుంచి 3 ఏళ్లు.. 25-30 ఏళ్లు.. 56-60 ఏళ్ల మధ్యలో ఉన్నట్టుండి ప్రేరేపితమవుతుంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చలికాలం ప్రారంభం కావటానికి నెల ముందు నుంచే శరీరమంతా మాయిశ్చరైజర్ రాసుకోవటం మొదలెట్టాలి. ఒకవేళ ఆరంభించకపోతే ఇప్పుడైనా రాసుకోవాలి. చలికాలం ముగిసిన నెల వరకూ దీన్ని కొనసాగించాలి.
సెరాయిడ్ లేదా యూరియా గల మాయిశ్చరైజర్‌ను తడి చర్మం మీద రాసుకోవాలి. అప్పుడది చర్మంలోకి త్వరగా చేరుతుంది. వీలైతే రోజుకు మూడు సార్లు మాయిశ్చరైజర్ వాడుకోవాలి.
పట్టు, నైలాన్ దుస్తులు అసలే వేసుకోవద్దు.
ఇంట్లో పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలి.
ఐదేళ్లు
దాటితే మందం కర్టెన్లు, తివాచీలు, పరుపులు వెంటనే మార్చేయ్యాలి. ఇంటిని
వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. చీపురుతో చిమ్మటం తగదు.
మరీ వెచ్చటి నీటితో, ఎక్కువ నురగ వచ్చే సబ్బులతో స్నానం చేయొద్దు.
అవసరమైతే
స్టిరాయిడ్ క్రీములు, టాక్లిమస్ పూత మందులు, సైక్లోస్పోరిన్ మందులు
వాడుకోవాలి. ఇవి టీ కణాలను తగ్గించటం ద్వారా దురద, మంట నుంచి ఉపశమనం
కలిగిస్తాయి.
ఎగ్జిమా క్రాకేల్ దురద, పగులు
ఇదీ ఒకరకం ఎగ్జిమానే. మోకాళ్ల కింది నుంచి పాదం మధ్య భాగంలో దురద పెట్టటం దీని ప్రత్యేకత. వృద్ధులు, థైరాయిడ్ సమస్య గలవారు, మధుమేహంతో చర్మం పొడిబారేవారిలో ఇది ఎక్కువ. చలికాలంలో ఇది మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఇందులో చర్మం పొడిబారి, పగులుతుంది. చూడటానికి ఎండిపోయిన చెరువు అడుగు భాగం మాదిరిగా కనిపిస్తుంది. వీళ్లు చర్మం రకాలను బట్టి గ్లిజరిన్, యూరియా, ఎమోలియెంట్, హ్యుమాక్టెంట్ మాయిశ్చరైజర్లు వాడుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. రంగు, వాసన, ప్రిజర్వేటివ్స్ లేని మాయిశ్చరైజర్లే వాడుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి, స్టిరాయిడ్ క్రీములు వాడొచ్చు.
థైరాయిడ్, మధుమేహం గలవారు వాటిని అదుపులో ఉంచుకోవాలి.
నురుగు తక్కువగా వచ్చే సబ్బులు గానీ బాడీవాష్‌లు గానీ వాడుకుంటే చర్మం మీదుండే రక్షణ పొర దెబ్బతినకుండా, సహజ నూనెలు కోల్పోకుండా చూసుకోవచ్చు. పొడి చర్మం, దురదను నివారించుకోవచ్చు.
మెత్తటి నూలు దుస్తులు ధరించాలి.
పెదాలు పగలటం నీరు తగ్గటంతో
చలికాలం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పెదాలు పగలటం. నీరు తక్కువగా తాగేవారిలో ఇది ఎక్కువ. చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు కాబట్టి మరింత ఎక్కువవుతుంది కూడా.
రోజుకు కనీసం 9-10 గ్లాసుల నీరు తాగాలి.
నీరు తాగిన ప్రతిసారీ పెదాలకు ఎస్‌పీఎఫ్ 15% ఉన్న బామ్ రాసుకోవాలి. దీంతో నీరు పెదాల్లోకి ఇంకి, పగలటం తగ్గుతుంది.
పాదాల పగుళ్లు ఒకింత జాగ్రత్త
అధిక బరువు, పొడిచర్మం, ఎక్కువగా తిరగటం, గట్టి చెప్పులు వేసుకోవటం వంటివి
మడమలు, పాదాలు పగలటానికి దారితీస్తుంటాయి. ఇది చలికాలంలో మరింత
ఎక్కువవుతుండటం గమనార్హం. బకెట్‌లో గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు కలిపి.. రెండు మూడు నిమిషాలు పాదాలను అందులో ఉంచాలి. తర్వాత శుభ్రంగా తుడుచుకొని, తడి ఆరిపోయేలోపు 20% యూరియాతో కూడిన క్రీము రాసుకోవాలి. దీంతో పొడిబారటం తగ్గుతుంది. మెత్తటి చెప్పులు ధరించాలి.