
67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్‌గా రూ. 1.2 కోట్లు చేతికి వచ్చాయి. రిస్క్‌ను అస్సలు ఇష్టపడని ఆయన.. సంపూర్ణ భద్రత కోసం ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెట్టాడు. బ్యాంకులో డబ్బు పెట్టడం అంటే ఎలాంటి ప్రమాదం లేదు.. వడ్డీ వస్తూనే ఉంటుంది. పింఛన్‌తో పాటు వడ్డీ కూడా వస్తే జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్మాడు.
అయితే కొద్ది రోజుల తరువాత ఆయన తన ఆర్థిక ప్రణాళికను పునఃసమీక్షించడానికి CA నితిన్ కౌశిక్‌ను కలిశాడు. రామకృష్ణ తన నిర్ణయం సరైనదని గర్వంగా చెప్పినప్పటికీ.. కౌశిక్ ఆయనకు ఒక వాస్తవాన్ని వివరించారు. అదే FDల భద్రత వెనుక దాగి ఉన్న ప్రమాదం. ఈ అంశాన్ని కౌశిక్ ఒక సరళమైన ఉదాహరణతో వివరించాడు.
టైర్‌లో నెమ్మదిగా గాలి తగ్గుతుంటే మనం వెంటనే గుర్తించలేము, కానీ కొంతసేపటికి టైర్ పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది. అదే విధంగా, FDలో డబ్బు పెరగకపోవడం వల్ల దాని విలువ కాలక్రమేణా నిశ్శబ్దంగా క్షీణిస్తుంది. ద్రవ్యోల్బణం అనే ధరల పెరుగుదల మన డబ్బు కొనుగోలు శక్తిని నెమ్మదిగా తినేస్తుంది.
సగటు ద్రవ్యోల్బణం 5 శాతం అయితే, డబ్బు విలువ సుమారు 14 నుండి 15 సంవత్సరాలలో సగం అవుతుంది. అంటే నేడు రూ. 1 కోటి విలువ ఉన్న డబ్బు, మరో 20 ఏళ్ల తర్వాత కేవలం రూ. 50 లక్షల విలువ మాత్రమే ఉంటుంది. వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉన్నపుడు, FDలు నిజమైన రాబడి ఇవ్వకుండా, పెట్టుబడిదారుల సంపదను నెమ్మదిగా తగ్గిస్తాయి.
పదవీ విరమణ చేసిన వారు ఎక్కువగా చేసే పొరపాటు ఇదేనని తెలిపారు. తమ డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉందనే నమ్మకం. కానీ జీవితం 60 ఏళ్ల వద్ద ఆగిపోదు. ప్రస్తుతం 65 సంవత్సరాల వ్యక్తి మరో 20-25 సంవత్సరాలు జీవించే అవకాశముంది. అంటే రిటైర్మెంట్ ప్లాన్ చాలా ఎక్కువ సంవత్సరాల ప్రయాణాన్ని మోయగలగాలి. FDలు మూలధన భద్రతను ఇస్తాయి. కానీ జీవనశైలిని సంరక్షించే వృద్ధిని ఇవ్వవు. వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణం ఇవన్నీ పెరుగుతాయి, కానీ FDలు మాత్రం స్థిరంగా ఉంటాయని తెలిపారు.
ఈ పరిస్థితిని మార్చడానికి.. కౌశిక్ రామకృష్ణకు ఓ పెట్టుబడి వ్యూహాన్ని సూచించాడు. మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా.. 70 శాతం బాండ్లు, డెబ్‌ట్ ఫండ్లలో, 20 శాతం నాణ్యమైన డివిడెండ్ చెల్లించే స్టాక్‌లలో 10 శాతం అత్యవసర పరిస్థితుల కోసం లిక్విడ్ ఫండ్లలో ఉంచడం మంచిదని తెలిపాడు. ఇది వేగంగా ధనవంతుడిని చేసే పద్ధతి కాదు, కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని భవిష్యత్తుని రక్షించే స్థిరమైన మార్గం.
దీంతో పాటుగా కౌశిక్ ఒక ముఖ్యమైన నిజాన్ని కూడా నొక్కి చెప్పారు. ఏ పెట్టుబడీ నిజంగా రిస్క్-ఫ్రీ కాదు. మనం డబ్బు బ్యాంకులో పెట్టకపోయినా, ద్రవ్యోల్బణం దానిని నెమ్మదిగా చెడగొడుతుంది. అందుకే, డబ్బు భద్రత కోసం కాకుండా, భవిష్యత్తు శక్తి కోసం పని చేయాలని సూచించారు. ఇక రామకృష్ణ కూడా రిటైర్మెంట్ అనేది సంపద సృష్టి ముగింపు కాదు.. అది మరో కొత్త ఆర్థిక దశ ప్రారంభం. జీవిత ప్రయాణం సుఖంగా ఉండాలంటే,ఖాళీగా కూర్చోకూడదని నిరంతరం పనిచేస్తూ ఉండాలని అర్థం చేసుకున్నాడు.