
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు ఆభరణాల కొనుగోలు చేయడం చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారంల మారింది. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు అసలు బంగారం కొనాలని అనుకున్న కలను వదిలేసి, ఇమిటేషన్ జ్యువెలరీ వైపు తిరుగుతున్నారు.
చిలకలపూడి కేరాప్ గోల్డ్ : ఇలాంటి పరిస్థితుల మధ్య మచిలీపట్నంకు సమీపంలోని చిలకలపూడి దేశవ్యాప్తంగా బంగారానికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఎన్నో దశాబ్దాలుగా ఇమిటేషన్ జ్యువెలరీ తయారీలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, ఇప్పుడు బంగారం ధరల పెరుగుదలతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, గోల్డ్ ప్లేటెడ్ సెట్లు, నెక్లెస్‌లు, గాజులు, వంకీలు, ఉంగరాలు, పెళ్లికూతురు బ్రైడల్ సెట్లు..ఇలా అసలు బంగారాన్ని పోలిన మెరుపుతో దొరకుతున్నాయి, ఆకర్షణీయమైన డిజైన్లు, బరువులేకుండా తేలికగా ఉండటం వల్ల ఇవి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచే కాదు.. సౌదీ అరేబియా, శ్రీలంక, చైనా, థాయిలాండ్ నుంచి కూడా వ్యాపారులు వచ్చి ఇక్కడి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు చిలకలపూడి జ్యువెలరీ రూ. 100 నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే లభించటం వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.
నైపుణ్యం కలిగిన కళాకారుల చేతిపని: ప్రతి ఆభరణం వెనుక నైపుణ్యం కలిగిన కళాకారుల చేతిపని ఉంటుంది. ఒక బ్రైడల్ సెట్‌ను తయారు చేయడానికి 20 నుంచి 25 మంది కళాకారులు కలిసి పనిచేస్తారు. చివరలో బంగారు పూత పూసి ప్రత్యేక పాలిష్ చేయడం వల్ల ఆభరణం సంవత్సరాల తరబడి అది మెరుపును కోల్పోదు. 1890లలో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ పరిశ్రమ.. ప్రస్తుతం భారీ MSME రంగంగా ఎదిగి వేలాది కుటుంబాలకు జీవనోపాధిని ఇస్తోంది. చిలకలపూడిలో 250 మందికిపైగా తయారీదారులు, 260కిపైగా రిటైల్ షాపులు పనిచేస్తుండటంతో మచిలీపట్నం మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.
బంగారం కంటే ఏమాత్రం తక్కువగా అనిపించదు: గుంటూరుకు చెందిన గృహిణి కట్ట వీణ మాట్లాడుతూ.. మచిలీపట్నం నుండి ఇమిటేషన్ ఆభరణాలను కొనుగోలు చేయడం తమ కుటుంబంలో ఒక సంప్రదాయం అని చెప్పారు. అందం, నాణ్యత, మెరుపు పరంగా అసలు బంగారం కంటే ఏమాత్రం తక్కువగా అనిపించదని, కనీసం రెండు సంవత్సరాల పాటు మరోసారి పూత అవసరం రాదని చెప్పారు.
సాధారణ కుటుంబాలకు దేవుని వరం: హైదరాబాద్‌కి చెందిన శ్రీశైలజా రెడ్డి కూడా ఇలాంటి అనుభవాన్నే పంచుకున్నారు. ఆమె కొనుగోలు చేసిన బ్రైడల్ సెట్ ధర రూ. 10 వేలు మాత్రమే, అదే బంగారంతో చేయాలంటే రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ సాధారణ కుటుంబాలకు దేవుని వరమని అన్నారు.
ఈ పరిశ్రమ విజయరహస్యం ఇదే: మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు. ధర తక్కువగా ఉండటం మాత్రమే కాకుండా బంగారం లాగా అద్భుతంగా కనిపించడం ఈ పరిశ్రమ విజయరహస్యం అని ఆయన అన్నారు.
ఈ పరిస్థితుల్లో చిలకలపూడి ఇమిటేషన్ జ్యువెలరీ కేవలం మధ్యతరగతి ఆదాయానికి ఉపశమనం మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు జీవనాధారం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళ, తాజా ఫ్యాషన్‌కు ప్రతీకగా మారింది.