
గుంటూరు నగరంలో పారిశుద్ధ్య పనులను సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సె్పక్టర్లు భాధ్యతగా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాల్సిందేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. జిటి రోడ్, శ్రీనివాసరావుపేట, శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ గా జరగాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, కార్యదర్శుల హాజరు ఉదయం 6 గంటలకు తమకు అందించాలని, త్వరలో హాజరు తప్పనిసరిగా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెయిన్ రోడ్లను ట్రాఫిక్ సమస్య లేకుండా ఉదయం 7 గంటలలోపే శుభ్రం చేయాలన్నారు. ఇళ్ల నుండే తడిపొడిగా వ్యర్ధాలు విభజన జరిగేలా అవగాహన కలిగించాలన్నారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి, వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. పర్యటనలో ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చుట్టుగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ను పరిశీలించారు.
