
గుంటూరు 24-01-2026 శనివారం :
ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బంధీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లకు ఓరియెంటేషన్ కల్పించారు. ఈసందర్భంగా ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు రెండు స్పెల్స్‌లో జరగనున్న జనరల్ ప్రాక్టికల్స్‌కు జిల్లాలోని 126 కేంద్రాల పరిధిలో 27,960 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఫిబ్రవరి 10 నుంచి 3వ స్పెల్‌లో 17 కేంద్రాల్లో పరిధిలో 2,292 మంది హాజరుకానున్నారని వివరించారు.పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను విధిగా ఏర్పాటు చేయాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.
ఆర్ఐవో జి.సునీత మాట్లాడుతూ విద్యార్థుల హాల్‌టిక్కెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, విద్యార్థులకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. అదే విధంగా విద్యార్థులు మనమిత్ర వాట్సప్ నంబరు 95523 00009 కు హాయ్ అని మెసేజ్ పంపి, ఇంటర్ ప్రధమ సంవత్సర హాల్ టిక్కెట్ నంబరు, ఆధార్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టిక్కెట్ పొందవచ్చునని సూచించారు.
ఈ సందర్భంగా ప్రాక్టికల్స్ నిర్వహణ విధి, విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఈసీ సభ్యులు కె.సుచరిత, సిరిల్‌పాల్, జానకి రామారావు, సుబ్బారావు, సీనియర్ ప్రిన్సిపాల్ బాలమోహన్, ఎం.శ్రీనివాసరావు, ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ కె.మోజెస్ పాల్గొన్నారు.
