gunturnews.in

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ విజయవంతం

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్‌ వాక్‌ థాన్‌


గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించారు. వాక్‌థాన్‌ ఓరియన్‌ హోటల్, స్థంబాలగరువు నుంచి ప్రారంభమై ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌ వరకు కొనసాగింది.

కార్యక్రమంలో సిమ్స్, హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, విజ్ఞాన్‌ ఫార్మసీ కాలేజ్, ఎన్నారై కాలేజ్, చలపతి ఫార్మసీ కాలేజ్, వీవీఐటీ యూనివర్సిటీలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు, ఆరోగ్య సేవకులు, పోలీస్‌ సిబ్బంది, రోటరీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌ బాబు మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం యువతలో గుండె, నరముల సంబంధిత సమస్యలు, మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. ఒక వైద్యుడిగా, బాధ్యతగల పౌరుడిగా డ్రగ్‌–రహిత సమాజ నిర్మాణం అత్యవసరమని, ముఖ్యంగా విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ డెప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాయపాటి మమత మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, తల్లిదండ్రులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు యువత జీవితాన్ని సరైన దారిలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ బిజినెస్‌ హెడ్‌ డాక్టర్‌ వై. కార్తిక్‌ చౌదరి మాట్లాడుతూ, డ్రగ్స్‌ కారణంగా సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక నష్టాలు గణనీయమైనవని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ, వైద్య, విద్యా సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతను చైతన్యవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అన్నారు.

Exit mobile version