
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే? దీని కోసం డాక్టర్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా ఇచ్చే సలహా ఒకటే. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవాలనే. నిజమే. ఎప్పుడైనా ఆలస్యంగా పడుకున్నా, త్వరగా లేచినా మర్నాడు నిరుత్సాహం, నీరసం ముంచుకొచ్చేస్తాయి. కానీ తగినంత నిద్రపోయినా అలసట వేధిస్తుంటే? తప్పకుండా ఆలోచించాల్సిందే.
ఉదయం లేస్తూనే చిరాకు. మూడ్ ఏదోలా ఉంటుంది. ఏ పనిచేయాలన్నా బద్ధకం. దేని మీదా ఆసక్తి ఉండదు. అలాగని రాత్రంతా మెలకువగా ఉన్నామా అంటే అదీ లేదు. బాగానే నిద్రపోయాం. మరెందుకీ కునికిపాట్లు? మళ్లీ పడుకోవాలని ఎందుకనిపిస్తోంది? మగతగా ఎందుకుంటోంది? ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. రాత్రిపూట 7-8 గంటల సేపు నిద్రపోయినా మర్నాడు ఏదో తెలియని అలసట. దీనికి ప్రధాన కారణం గాఢ నిద్ర కొరవడటమే. అవును… ఎన్ని గంటలనేదే కాదు, ఎంత హాయిగా నిద్రపోయామన్నదీ ముఖ్యమే. 10-12 గంటల సేపు పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర పట్టకపోతే హుషారు గల్లంతవుతుంది. మనకు తెలియకుండానే ఎన్నెన్నో అంశాలు ఈ గాఢ నిద్రను దెబ్బతీస్తుంటాయి.
కారణాలు రకరకాలు
డిజిటల్ తెరలు: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ తెరల నుంచి వెలువడే నీలికాంతి మెదడును తికమకపరుస్తుంది. రాత్రినీ పగలుగా భావించేలా చేస్తుంది. దీంతో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా మెదడు చురుకుగా ఆలోచిస్తుంటుంది. మొత్తానికి గాఢ నిద్ర కరవవుతుంది.
కెఫీన్, మిఠాయిలు: రాత్రిపూట టీ, కాఫీ తాగటం.. చాక్లెట్లు, మిఠాయిలు తినటం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీంతో శరీరం విశ్రాంతి స్థితికి చేరుకోక నిద్ర దెబ్బతింటుంది.
వేళాపాళా లేని పడక: రోజుకోరకంగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, లేవటం వల్ల ఒంట్లో జీవగడియారం అస్తవ్యస్తమవుతుంది. దీంతో నిద్ర, మెలకువల తీరు గతి తప్పి నీరసం, నిస్సత్తువ ఆవహించేస్తాయి.
నిద్ర సమస్యలు: కొందరికి నిద్రిస్తున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై, కిందికి జారుతుంది. ఇది శ్వాసమార్గానికి అడ్డుపడటం వల్ల కాసేపు శ్వాస ఆగుతుంది (స్లీప్ అప్నియా). అప్పుడు వెంటనే మేల్కొని, గట్టిగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. నిద్రలో ఉండటం వల్ల మెలకువ వచ్చిన సంగతి తెలియదు. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతుంది. దీంతో గాఢ నిద్ర కరవవుతుంది. రక్తంలో ఆక్సిజన్ తగ్గటం వల్ల పగటిపూట మగతగా, నిస్సత్తువగా ఉంటుంది. కాళ్లలో చిరచిర (రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్) వంటి నిద్ర సమస్యలూ గాఢ నిద్రను దెబ్బతీస్తాయి.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం కూడా కారణమే. తగినన్ని థైరాయిడ్ హార్మోన్లు విడుదల కాకపోతే జీవక్రియ మందగిస్తుంది. నిద్ర ప్రక్రియా అస్తవ్యస్తమవుతుంది. నిద్రలేమితో థైరాయిడ్ పనితీరూ తగ్గుతుంది. ఇలా ఇదొక విషవలయంగా తయారవుతుంది. ఫలితం- అదేపనిగా నీరసం.
పరిసరాలు: పడకగది మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్నా.. గాలి సరిగా ఆడకపోయినా, పరిసరాల్లో వాహనాల హారన్ మోతల వంటి చప్పుళ్లు వినిపిస్తున్నా నిద్రకు విఘాతం కలుగుతుంది. మధ్యమధ్యలో మెలకువ వచ్చేస్తుంది.
రక్తహీనత: ఐరన్ లోపంతో తలెత్తే రక్తహీనత (ఎనీమియా)లో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. ముఖ్యంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే నీరసానికి దారితీస్తుంది. రక్తహీనతతో కాళ్లలో చిరచిర, ఆయాసం వంటి సమస్యలూ తలెత్తొచ్చు. ఇవీ నిద్రకు భంగం కలిగించేవే. విటమిన్ బి12 లోపమూ రక్తహీనతకు కారణమవుతుంది.
సరిచేసు కోవాల్సిందే
నిద్ర శరీరాన్నే కాదు, మనసునూ పునరుత్తేజితం చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి రకరకాల సమస్యలు దాడి చేయటం ఖాయం. కాబట్టి గాఢ నిద్రను దెబ్బతీస్తున్న అంశాలను గుర్తించి, సరిచేసుకోవటం చాలా ముఖ్యం.
- పడకగదిలో మొబైల్ ఫోన్ల వంటివి వాడకపోవటం
- రాత్రిపూట మరీ ఎక్కువగా తినకపోవటం
- పడుకోవటానికి రెండు గంటల ముందే భోజనం చేయటం
- పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం
- రాత్రివేళ కాఫీ, టీ, కూల్‌డ్రింకులు తాగకపోవటం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం
- నిద్ర సమస్యలకు తగు చికిత్స తీసుకోవటం
- ఆఫీసు నుంచి వచ్చాక గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, పడుకునే ముందు గ్లాసు పాలు తాగటం.
– ఇలాంటి జాగ్రత్తలు గాఢ నిద్రకు తోడ్పడతాయి. అప్పుడు ఉత్సాహం ఎల్లప్పుడూ వెంటే ఉంటుంది.
