
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ వర్ధంతిని ‘మహాపరినిర్వాణ్ దివస్’గా జరుపుకుంటారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు కూడా ఇదే. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 6ను ‘శౌర్య దివస్’గా పాటించాలంటూ రాజస్థాన్ ప్రభుత్వం పాఠశాలలకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది.
‘సత్యమేవ జయతే’ రూపంలో ధర్మం మన జాతీయ నినాదం. రాజ్యాంగ నైతికత మన దేశ నిర్మాణానికి దోహదపడుతుందని అంబేద్కర్ ఆశించారు. ‘విలువలు, నైతికత, అబద్ధమాడకపోవడం, అసత్యాన్ని నివారించడం’అనేవి ‘సత్యమేవ జయతే’నుంచే ఉద్భవించాయి- కేవలం ‘సత్యం’ మాత్రమే గెలుస్తుంది, మరేదీ కాదు.
భారత రాజ్యాంగ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినప్పటికీ, ఉల్లంఘించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగానికి లేదు.
రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949 నవంబర్ 26 భారత ప్రజలకు ఒక గొప్ప రోజు. పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు వంటి ముఖ్యమైన అంశాలు అప్పటి నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ అంబేడ్కర్ న్యాయపాలన జనవరి 26న పూర్తిగా అమల్లోకి రావడాన్ని చూశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగపరంగా భారత ప్రభుత్వం పనిచేయడాన్ని చూసిన అంబేడ్కర్ ఆరేళ్లకు మించి జీవించలేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6న ఢిల్లీలోని తన నివాసంలో నిద్రలోనే మరణించారు. ఆయన మధుమేహం, కంటి చూపు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలతో చాలా ఏళ్లుగా బాధపడ్డారు. ‘ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ’ పుస్తక చివరి చేతిరాత ప్రతిని పూర్తి చేసిన మూడు రోజులకే కాలం చేశారు. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాజ్యాంగాన్ని నిర్మించారు.
రాజ్యాంగం ఒక నైతిక నియమావళి..
రాజ్యాంగ నైతిక నియమావళి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉంది. ఇది శిక్షాస్మృతి లేదా శిక్షా రాజ్యాంగం కాదు. ప్రతిరోజూ ఈ నైతికతను ఉల్లంఘిస్తూనే ఉన్నాం. ప్రమాణ భంగం చేయడం, నైతికతను నాశనం చేయడం రోజువారీ కార్యకలాపంగా మారిపోయింది.
ఒక కుటుంబంలో ఎక్కడో, ఎప్పుడో ఒకసారి- కనీసం తల్లి, తండ్రి, సోదరుడు భార్యకైనా వాస్తవం లేదా సత్యం చెప్పాలని గుర్తుంచుకోవాలి. కానీ, సత్యం చెప్పడానికి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఎవరైనా దరఖాస్తు చేయాల్సిన అవసరం వస్తుందా? అవును, అది కూడా జరిగింది. ఆ ‘పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్’ నిజం చెబుతాడా? కనీసం సమాచారం ఇవ్వనందుకు జరిమానా విధించేది నైతిక నియమావళా లేక శిక్షా చట్టమా? భర్త నెలవారీ జీతం ఎంతనేది తెలుసుకునే అర్హత భార్యకు ఉందా లేదా? అది అంత చిన్న’సత్యం’, ఆమె తెలుసుకోవాలనుకుంటే చెప్పాలి కదా!
‘సత్యమేవ జయతే’ రాజ్యాంగ నినాదం, రాజ్యాంగ నైతికతలో భాగం.
నీతి, నైతికత ఉందా?
వాస్తవానికి, ‘రాజ్యాంగ నైతికత’అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ, అది భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్న ప్రధానతత్త్వమని నైతిక నియమావళిని మనం అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం కేవలం చట్టంలోని అక్షరాలా పాటించడమే కాదు. దాని స్ఫూర్తిని ప్రాథమిక విలువలను(సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటివి) పాటించడం. ఇది మెజారిటీ ఆధిపత్యానికి ఏకపక్ష అధికారానికి ఒక ముఖ్యమైన కళ్ళెం. దీనిని తరచుగా సుప్రీంకోర్టు సమర్థిస్తూ వస్తోంది. కానీ ఏం జరుగుతున్నది?
ప్రాథమిక ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే రాజ్యాంగ నైతికత. ఇది భారతీయ రాజ్యాంగ మౌలిక స్వరూపం. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని పరిపూర్ణం చేసినందుకు; ‘మౌలిక స్వరూపం’ అనే భావన అప్పటికి రాలేదు. అంబేడ్కర్ గనుక బతికి ఉండుంటే, కనీసం పీఠికలోనైనా దీనిని రాజ్యాంగంలో ముఖ్యమైన భాగంగా చేర్చి ఉండేవారు. సుప్రీంకోర్టు పనితీరును, మన పాలనన, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చేసి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పీటీఎల్) భావనను అంబేడ్కర్ అప్పుడే ఉపయోగించాల్సింది. ఇది భారత రాజ్యాంగం అంతరాత్మ.
రాజ్యాంగ నైతికత, రాజుల, రాజకీయక నిరంకుశత్వాన్ని నివారిస్తుందని భావిస్తారు. ఎన్నికైన మెజారిటీ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి ప్రాథమిక హక్కులను సూత్రాలను ఉల్లంఘించకుండా నిరోధించడానికి ఇది ఒక ఉన్నత ప్రమాణంగా పనిచేస్తుంది.
బలమైన మెజారిటీ తనను తాను రక్షించుకోగలదు. కానీ మైనారిటీల పరిస్థితి ఏమిటి? మెజారిటీ ప్రజలకు నచ్చకపోయినా, మైనారిటీ వర్గాల హక్కులు ప్రయోజనాలు కాపాడుకునే విధంగా రాజ్యాంగ నైతికత తోడ్పడుతుంది.
రాజ్యాంగం అనేది కేవలం మెజారిటీ ఎంపీల ఒక శాసన ప్రకటన మాత్రమే కాదు. అది చైతన్యశీలిగా ఉండాలి. ఈ చైతన్య ప్రవాహం. పరిణామం. రాజ్యాంగ అధికారిక సవరణలు అవసరం లేకుండానే, మారుతున్న సామాజిక అవసరాలు; విలువలకు అనుగుణంగా రాజ్యాంగం మారడానికి అనుమతిస్తుంది. పీఠిక కూడా అదే వివరిస్తున్నది.
అదే సమయంలో, దీనికి తనదైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాజనీతి’రాజ్యాంగ నైతికత’ అనేది ఒక అస్పష్టమైన భావన. ఇది “నైతికత” పేరుతో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత విలువలను లేదా రాజకీయ భావజాలాన్ని రుద్దడానికి అవకాశం ఉంది. మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం మౌలిక స్వరూపాన్ని వ్యక్తిగత విలువలు రాజకీయ పార్టీ అంటే వామపక్షాలు, దక్షిణ పక్షాలు, మధ్యవాది రకరకాల భావజాలం నుంచి మనం మనల్ని రక్షించుకోవాలి. తక్షణ సవాలు మన ముందు ఉన్నదేమంటే 130వ సవరణ ఆఘమేఘాల మీద జరిగింది. ప్రమాదకరమైంది.
రాష్ట్రపతి బాధ్యతలపై సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు తీర్పు నైతిక మార్గదర్శకమా లేక కచ్చితంగా పాటించాల్సినదా? తీర్పు ప్రకారం, రాష్ట్ర బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయవ్యవస్థ నిర్ణీత కాలపరిమితిని విధించలేదని పేర్కొంది.
సుదీర్ఘ కాలం పాటు చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ‘‘పరిమిత న్యాయ సమీక్ష’’కు లోబడి ఉంటుందని స్పష్టం చేసినప్పటికీ; ఇంతకుముందు కోర్టు సూచించిన నిర్దిష్ట కాలపరిమితులు న్యాయాధికార పరిధిని దాటడమేనని తెలిపింది.
కచ్చితమైన, అమలు చేయదగిన కాలపరిమితి లేకపోవడం వల్ల బిల్లులను గవర్నర్లు ఎక్కువ కాలం, బహుశా అనవసరమైనంత కాలం పెండింగ్‌లో ఉంచడానికి అనుమతించినట్టవుతుంది. దీంతో పాలన స్తంభించిపోతుంది; ఎన్నికైన రాష్ట్ర శాసనసభల ఆశయాలు దెబ్బతింటాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల హక్కులను, పాలనా అజెండాను బలహీనపరచడానికి ఈ నిర్ణయం అధికారమిస్తుందని; ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తుందని అర్థమవుతుంది.
రాజ్యాంగ నైతికతపై(ఉంటేగింటే) మితిమీరి ఆధారపడటం వల్ల న్యాయవ్యవస్థ శాసన లేదా కార్యనిర్వాహక రంగాలలోకి చొరబడే ప్రమాదముందని భయపడుతున్నారు. పాలన పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనే శీర్షిక కింద మనం అనేక ఉదాహరణలను చూడవచ్చు. మళ్ళీ, 130వ సవరణను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రాజనీతి, రాజ్యాంగ నీతి ఆధారిత తీర్పులు ప్రజా ఆదరణ పొందిన చట్టాలను రద్దు చేసినప్పుడు, అది న్యాయవ్యవస్థ శాసన/కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు.
న్యాయ పాలనను సమర్థించడం..
రాజ్యాంగ సమగ్రత అనేది చట్టపరమైన చట్రం స్థిరత్వాన్ని నిర్ధారించాలి. పాలన ఊహించదగినదిగా, న్యాయబద్ధంగా ఉండేలా చూడాలి. పనిచేసే ప్రజాస్వామ్యంలో, ప్రజలకు రాజ్యాంగ సమగ్రత అవసరం. అంటే రాజ్యాంగం సంపూర్ణంగా, పటిష్టంగా చెక్కుచెదరకుండా ఉండటం. ఇది మౌలిక స్వరూపం, పొందిక దాని వ్యవస్థాపక సూత్రాలకు- బేసిక్ స్ట్రక్చర్‌కు కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది.
అయితే, ‘రాజ్యాంగ ఔచిత్యం’ అనేది రాజ్యాంగం ప్రాథమిక నిబంధనలు సంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు(రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు…) నీతివంతకంగా సముచితంగా నిర్వహించాలి. లేకపోతే రాజ్యాంగం నడవదు.
అంతకంటే ముందు, మనం విశ్వాసాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా రాజ్యాంగ ఔచిత్యం, పదవిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడటం ద్వారా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పెంచుతుంది.
అక్షరాలా అమలు చేయాలంటే ‘‘ఆచరణ’’లో అస్పష్టత; ప్రభుత్వ రాజకీయపరమైనపాలనను కావాలని కఠినతరం చేస్తున్నాయి. ఆ మొండి వైఖరిని నివారించాలి. సమగ్రతకు కఠినంగా కట్టుబడి ఉండటం కొన్నిసార్లు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన రాజ్యాంగపరమైన పరిపాలన; సరైన సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చు. ఆచరణలో అస్పష్టత ఔచిత్యాన్ని చట్టపరంగా అమలు చేయడం కష్టం. ఎందుకంటే, ఇది స్పష్టమైన అక్షరాలా అమలు చేసే చట్టాల కంటే కఠినమైన పదాలను అన్వయించే అన్యాయాల కన్నా- కాని సంప్రదాయాలు, రాజకీయ నీతికి సంబంధించినవి.
రాజ్యాంగ క్రిమినాలిటీ & సివిల్ తప్పిదాలు ఈ భావనలు, ముఖ్యంగా రాజ్యాంగ క్రిమినాలిటీ- అధికారిక చట్టపరమైన పదాలు కాదు. కానీ రాజ్యాంగ వ్యవస్థ లోతైన వైఫల్యాలను వివరించడానికి రాజకీయ/ విద్యాపరమైన చర్చల్లో ఉపయోగించాలి.
నేరగాళ్లనే తత్వంతో(Criminality): అధికారంలో ఉన్నవారు రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ విధులను, ప్రాథమిక హక్కులను లేదా మౌలిక స్వరూపాన్ని ఉద్దేశపూర్వకంగా, వ్యవస్థీకృతంగా లేదా విస్తృతంగా ఉల్లంఘించడం. ఉదాహరణ: మూకుమ్మడి ఫిరాయింపులు, ఉద్దేశపూర్వక సంస్థాగత విధ్వంసం.
వ్యవస్థాగత వైఫల్యాన్ని గుర్తించడం: సాధారణ చట్టపరమైన ఉల్లంఘనలకు మించిన ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ముప్పులను(ఉదా: రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరాలు) బహిర్గతం చేయడానికి గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
సమస్య ఏమిటంటే, రాజకీయ ప్రత్యర్థులు దీనిని ఆయుధంగా మార్చుకుని, దాని అసలు అర్థాన్ని పలుచన చేసి, కేవలం రాజకీయ నినాదంగా మార్చే అవకాశం ఉంది.
అయితే, ‘రాజ్యాంగపరమైన సివిల్ తప్పిదాలు’వేరు. పౌరుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి, వారికి హాని కలిగించేలా ప్రభుత్వం లేదా దాని యంత్రాంగం చేసే చర్యలు, పరిహారం కోరడానికి దారితీస్తాయి(ఉదా: పోలీసుల దాష్టీకం, అక్రమ నిర్బంధం). ప్రభుత్వ చర్యల వల్ల గాయపడిన పౌరులను రక్షించడానికి పబ్లిక్ లా రెమెడీస్ కింద వారికి పరిహారం ఇప్పించడానికి ఇది న్యాయవ్యవస్థకు నేరుగా అధికారమిస్తుంది.
తీవ్రమైన సమస్య ఏమంటే వ్యాజ్యాలలో జాప్యం: అన్ని సివిల్ పరిష్కారాలవలెనే, న్యాయ ప్రక్రియ నెమ్మదిగా సాగడం వల్ల దీని అమలులో జాప్యం జరగవచ్చు. ఉదాహరణకు, సవరణ తర్వాత రాజ్యాంగంలో భాగమైన ఫిరాయింపుల నిరోధక చట్టం కొంతవరకు ‘శిక్షా’ స్మృతిగా మారింది. మనం సాధారణ జాప్యానికి పెండింగ్ కేసులకు అలవాటు పడిపోయాం. ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి, ఫిరాయింపుల నిరోధక శిక్షా నియమం పని చేయలేదు. ఈ నేపథ్యంలో నీతికి, రాజ్యాంగనీతికి, రాజకీయ అవినీతికి తేడాలు గమనించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది.
రచయిత : మాడభూషి శ్రీధర్
ది వైర్ కథనం