
కరపత్రాలను అందజేస్తున్న నూరిఫాతిమా, గులాం రసూల్ తదితరులు
గుంటూరు 24-01-2026 శనివారం :
అంజుమన్ భూముల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా స్పష్టం చేశారు. చినకాకానిలో అంజుమన్ భూములను ఐటీ పార్క్ నిర్మాణం నిమిత్తం నోటీఫీకేషన్ జారీ చేసిన నేపధ్యంలో శనివారం నియోజకవర్గంలోని 15వ డివిజన్ హుస్సేన్నగర్లో “ఇంటింటికీ తిరిగి సంతకాల సేకరణ” కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను అందజేసి, భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు.
ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ అంజుమన్ భూములను ధారదత్తం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మసీదుల వద్ద చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ముస్లీం మైనారిటీల చట్టాలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకులు షేక్ గులాం రసూల్ మాట్లాడుతూ అంజుమన్ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లీం మైనారిటీల అందరిపై ఉందన్నారు. దీని కోసం జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.
